మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తాయని తెలిపాయి. హరియాణాలో మాత్రం ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కొద్దిగా విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మహారాష్ట్రల్లో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50-50 ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన కలవనుందనే వార్తలను ఆయన ఖండించారు. అయితే ఐదేళ్ల పాలనలో సగం కాలం పాటు తమ పార్టీకి చెందిన వ్యక్తి సీఎం ఉండేలా చూడాలని శివసేన వర్గాలు భావిస్తున్నట్టుగా సమాచారం